Sunday, September 21, 2008

మోక్షసన్యాస యోగం(18 వ అధ్యాయం)

అర్జునుడు:
కృష్ణా!సన్యాసము,త్యాగము అంటే ఏమిటి?వివరంగా చెప్పు?
కృష్ణుడు:
కోరిక చే చేయు కర్మలను మానడం సన్యాసమనీ,కర్మఫలితాలు విడిచిపెట్టడమే త్యాగమని పండితులు అంటారు.కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు,యజ్ఞ,దాన తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.
త్యాగ విషయంలో నా అభిప్రాయం ఏమంటే చిత్తశుద్దిని కల్గించు యాగ,దాన,తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు.వాటిని కూడా మమకారం లేక,ఫలాపేక్ష లేక చెయ్యలని నా అభిప్రాయం.
కర్తవ్యాలను విడిచిపెట్టడం న్యాయం కాదు.అలా విడవడం తామస త్యాగం.
శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం.ఫలితం శూన్యం.
శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ,కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్వికత్యాగం.ఇలా చేయువాడు,సందేహాలు లేనివాడు ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు.సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు.
శరీరం కల్గినవారు కర్మలను వదలడం అసాధ్యం.కాబట్టి కర్మఫలితాన్ని వదిలేవాడే త్యాగి.
ఇష్టము,అనిష్టము,మిశ్రమము అని కర్మఫలాలు మూడు రకాలు.కోరిక కల్గిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును.కర్మఫలత్యాగులకు ఆ ఫలితాలు అందవు.
శరీరం,అహంకారం,ఇంద్రియాలు,ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు,పరమాత్మ అను ఈ ఐదే అన్ని కర్మలకూ కారణమని సాంఖ్య శాస్త్రం చెప్తోంది.
మనస్సు,మాట,శరీరాలతో చేసే అన్ని మంచి,చెడు కర్మలకూ ఈ ఐదే కారణము.ఈ విషయాలు తెలియనివారు,చెడ్డ భావల వారు మాత్రం తమే చేస్తున్నట్టూ అహంకారంతో తిరుగుతారు.
తను పని చేస్తున్నానన్న అహంకారం లేనివాడు,అజ్ఞానం లేనివాడు ఈ లోకం లో అందరినీ చంపినా సరే - ఆ పాపం వారికి ఏ మాత్రమూ అంటదు.
జ్ఞానం,జ్ఞేయం,పరిజ్ఞాత అని మూడు కర్మ ప్రోత్సాహకాలు.అలాగే కర్త,కర్మ,సాధనం అని కర్మ సంగ్రహం మూడు రకాలు.
జ్ఞానం,కర్మ,కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం మూడేసి విధాలుగా ఉన్నాయి.వాటిని విను.
విభిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశమై,మార్పు లేని,ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం.
ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం.
ఏది చూస్తే అదే సర్వమని అనుకొనే జ్ఞానం తామసజ్ఞానం.
అభిమాన,మమకార,ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం.
ఫలితం పైన ఆసక్తితో,అహంకార అభిమానాలతో,చాలా కష్టంతో చేయునవి రాజసకర్మలు.
మంచిచెడ్డలను,కష్టనిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామసకర్మ.
ఫలితం పైన ఆశ పెట్టుకోకుండా,నిరహంకారియై,ఫలితం లోని మంచిచెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పని చేయువాడు సాత్వికకర్త.
ఫలితం పైన ఆశతో,అభిమానంతో,లోభగుణంతో,హింసతో,అశుచిగా,సుఖదుఃఖాలకు చలిస్తూ పని చేయువాడు రాజసకర్త.
ధైర్యం పోగొట్టుకొని,మూర్ఖత్వంతో,మోసంతో,దీనమనస్సు తో,వృథా కాలయాపంతో పనిచేయువాడు తామసకర్త.
బుద్ధి,ధృతి అనే ఈ రెండూ గుణబేధాలచే మూడు విధాలు.
ధర్మాధర్మములందు ప్రవృత్తి నివృత్తులను-కర్తవ్యాకర్తవ్యాలను-భయాభయాలను-బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్వికబుద్ధి.
ధర్మాధర్మాలు,కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజసబుద్ధి.
ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామసబుద్ధి.
మనసు,ప్రాణం,ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు.
ఫలితంపై అధిక ఆసక్తి,ధర్మ,అర్థ,కామాలందు చూపే అధిక పట్టూదలే రాజస ధృతి.
కల,భయం,బాధ,విషాదం,గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసికధృతి.
సుఖాలు మూడు విధాలు.
మొదట దుఃఖకరమైనా సాధన చేస్తున్నకొద్దీ సులవు అనిపించి,ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో-ఆ అమృతమయబుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం.
ఇంద్రియ సంయోగం వలన పుట్టేదీ,మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజససుఖం.
ఎప్పుడూ మోహింపచేస్తూ,నిద్ర,ఆలస్య,ప్రమాదాలతో కూడినది తామస సుఖం.
త్రిగుణాలకు అతీతమైనది ఏదీ భూ,స్వర్గ లోకాలలో,దేవతలలో ఎక్కడా ఉండదు.
స్వభావ గుణాలను అనుసరించి నాలుగు వర్ణాలవారికీ కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి.
బాహ్య,అంతర ఇంద్రియనిగ్రహం,తపస్సు,శౌచం,క్షమ,సూటిస్వభావం,శాస్త్రజ్ఞానం,
అనుభవజ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు.
శౌర్యం,తేజస్సు,ధైర్యం,వెన్ను చూపనితనం,సపాత్రదానం,ఉత్సాహశక్తులు క్షత్రియ కర్మలు.
వ్యవసాయం,గోరక్షణ,వ్యాపారం వైశ్యులకు-సేవావృత్తి శూద్రులకు స్వభావ కర్మలు.
తన స్వభావకర్మలను శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతాడు.
పరమాత్మను తనకు విధింపబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు.
బాగా చేసే పరధర్మం కన్నా దోషం చే చేసే స్వధర్మం చేయడమే మంచిది.
స్వధర్మం దోషంతో ఉన్నా విడవరాదు.అగ్నిని పొగ ఆవరించి ఉన్నట్టూ అన్ని ధర్మాలూ ఏదో ఒక దోషం కలిగిఉంటాయి.
విషయాసక్తి లేనివాడు,ఇంద్రియనిగ్రహీ,చలించనివాడూ జ్ఞానమార్గం చే నైష్కర్మ్యసిద్ధిని పొందుతాడు.
నిష్కామ కర్మచే జ్ఞానసిద్ధిని పొందినవాడు పరమాత్మను పొందేవిధానం చెపుతాను విను.
మాయ లేని నిశ్చలజ్ఞానంతో మనసును నిగ్రహించి,శబ్దాదివిషయాలను వదిలి,రాగద్వేష రహితుడై,నిత్యమూ విరాగియై,యేకాంత వాసంతో,అల్పాహారియై,మనస్సు,మాట,శరీరాలల్ను నియమబద్దం చేసి,ధ్యానయోగియై,అహంకార,అభిమాన,కామ,క్రోధాలను వదిలి,విషయస్వీకారం విడిచి,మమకారంలేనివాడై,శాంతచిత్తం కల్గినవాడే బ్రహ్మభావానికి అర్హుడు.
బ్రహ్మజ్ఞాని దేనినీ కోరడు.దేనికీ దుఃఖించడు.అన్ని భూతాలందూ సమదృష్టి కల్గి నా భక్తిని పొందుతాడు.
ఆ భక్తిని పొందినవాడు నన్ను పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే నాలో ఐక్యం అవుతాడు.
అన్ని పనులు చేస్తున్నా,నన్నే నమ్మిన కర్మయోగి నా పరమపదమే పొందుతాడు.
అన్ని కర్మలూ నాకే అర్పించి సమబుద్దిరూపమైన యోగం చెయ్యి.నేనే పరమగతినని తెలుసుకొని నీ మనసును నాలోనే లగ్నం చేయి.
నన్ను శరణు కోరితే నా అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తావు.కాదని అహంకరిస్తే నాశనమవుతావు.
యుద్దం చేయకూదదని నీవనుకున్నా నీ నిర్ణయం వృథానే.ఎందుకంటే నీ క్షత్రియధర్మమే నిన్ను యుద్దానికి ప్రేరేపిస్తుంది.
సర్వభూతాలనూ తన మాయచే కీలుబొమ్మలలా ఆడిస్తూన్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు.
అతడినే అన్నివిధాలా శరణు వేడు.అతని దయచే శాంతి,మోక్షం పొందుతావు.
అతిరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను.బాగా ఆలోచించి నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి.
నా యందు మనసు కలిగి,నన్నే భక్తితో సేవించు.నన్నే పూజించు.నమస్కరించు.నీవు నాకు ఇష్టం కావున నీతీ ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను.నిశ్చయంగా నువ్వు నన్నే పొందుతావు.
అన్ని ధర్మాలనూ వదిలి నన్నే శరణువేడు.నిన్ను అన్ని పాపాలనుండీ బయటపడవేస్తాను.
తపస్సులేని వాడికీ,భక్తుడు కాని వాడికీ,సేవ చేయని వాడికీ,నన్ను అసూయతో చూసేవాడికీ ఈ శాస్త్రాన్ని చెప్పరాదు.
అతిరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు అందించేవాడు,నిశ్చయంగా నా పరమాత్మ భావాన్ని పొందుతాడు.
ఈ గీతాశాస్త్రప్రచారకుడికన్నా ఎక్కువైన భక్తుడు కానీ,ప్రియుడుకానీ,ఈ లోకంలో నాకు మరొకడు లేడు.
మన సంవాదరూపమైన ఈ గీతను ఎవడు పారాయణ చేస్తాడో వాడివలన నేను జ్ఞానయజ్ఞంచే ఆరాధింపబడినవాడిని అవుతున్నాను.
శ్రద్దాసక్తి తో,అసూయలేక దీనిని విన్నవారు గొప్పగొప్ప పుణ్యాలు చేసినవారు పొందే లోకాలను తేలికగా పొందుతారు.
ఇంతవరకూ నేను చెప్పినది మనసు లగ్నం చేసి విన్నవా?నీ మోహం నశించినదా?
అర్జునుడు:
నీ దయవలన నా అజ్ఞానం తీరింది.సందేహం పోయింది.ఆత్మజ్ఞానం కల్గింది.నువ్వేమి చెప్తే అది చేయడానికి సిద్దంగా ఉన్నాను.

సంజయుడు:
ధృతరాష్ట్ర మహారాజా!మహాత్ములైన శ్రీకృష్ణార్జునుల సంవాదం నేను విన్నాను.పులకించాను.
శ్రీవ్యాసుల దయచేత యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పిన యోగశాస్త్రాన్ని ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు కలిగింది.ఆ సంవాదం మాటిమాటికీ మా మనస్సును ఉప్పొంగిస్తోంది.ఆ అద్భుత విశ్వరూపం తలుచుకుంటుంటే నా ఆనందం అధికమవుతోంది.
యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు,ధనుర్ధారి ఐన అర్జునుడూ ఎక్కడ ఉంటారో అక్కడే లక్ష్మీదేవి,విజయమూ,ఐశ్వర్యమూ ఉంటాయనేది నా దృఢనిశ్చయము.

శ్రద్దాత్రయ విభాగ యోగము(17 వ అధ్యాయము)

అర్జునుడు:
కృష్ణా!శాస్త్రవిధిని మీరినా శ్రద్ధతో పూజించేవారు సాత్వికులా,రాజసులా,తామసులా?వీరి ఆచరణ ఎలాంటిది?
కృష్ణుడు:
పూర్వజన్మల కర్మల వలన జీవులకు సాత్విక,రాజస,తామస శ్రద్ధలు ఏర్పడతాయి.
స్వభావంచే శ్రద్ధ పుడుతుంది.శ్రద్ధలేని వాడు ఎవరూ ఉండరు.శ్రద్ధ ఎలాంటిదైతే వారు అలాంటివారే అవుతారు.
సాత్వికులు దేవతలనీ,రాజసులు యక్షరాక్షసులనీ,తామసులు భూతప్రేతాలనీ పూజిస్తారు.
శాస్త్రనిషిద్దమైన తపస్సును,దారుణ కర్మలను చేసేవాళ్ళూ,దంభం,అహంకారం తో శరీరాన్నిశరీరాన్ని,ఇంద్రియాలను,అంతర్యామినైన నన్నూ బాధించేవారు అసుర స్వభావం గలవారు.
ఆహార,యజ్ఞ,తపస్సు,దానాలు కూడా గుణాలను బట్టే ఉంటాయి.
ఆయుస్సునూ,ఉత్సాహాన్ని,బలాన్ని,ఆరోగ్యాన్ని,సుఖాన్ని,ప్రీతినీ వృద్ధి చేస్తూ రుచి కల్గి,చమురుతో కూడి,పుష్టిని కల్గించు ఆహారం సాత్వికాహారం.
చేదు,పులుపు,ఉప్పు,అతివేడి,కారం,ఎండిపోయినవి,దాహం కల్గించునవి రాజస ఆహారాలు.ఇవి కాలక్రమంలో దుఃఖాన్ని,రోగాలనూ,చింతనీ కల్గిస్తాయి.
చద్దిదీ,సారహీనమూ,దుర్వాసన కలదీ,పాచిపోయినదీ,ఎంగిలిదీ,అపవిత్రమైనదీ అయిన ఆహారం తామసము.
శాస్త్రబద్దంగా ఫలాపేక్ష లేక చేసేది సాత్విక యజ్ఞం.
ఫలాపేక్షతో,పేరు కోసం,గొప్పను చాటుకోవడం కోసం చేసేది రాజసయజ్ఞం.
శాస్త్రవిధి,అన్నదానం,మంత్రం,దక్షిణ,శ్రద్ధ లేకుండా చేసేది తామస యజ్ఞం.
దేవతలను,పెద్దలను,గురువులను,బ్రహ్మవేత్తలను పూజించడం,శుచి,సరళత్వం,బ్రహ్మచర్యం,అహింస శరీరం తో చేయు తపస్సు.
బాధ కల్గించని సత్యమైనప్రియమైన మాటలు,వేదాభ్యాసం మాటలచే చేయు తపస్సు.
నిశ్చల మనస్సు,మృదుత్వం,మౌనం,మనఃశుద్ధి కల్గిఉండడం మనసుతో చేయు తపస్సు.
ఫలాపేక్షరహితం,నిశ్చలమనస్సు,శ్రద్దతో చేయు తపస్సు సాత్వికం.
కీర్తిప్రతిష్ఠల ఆశతో గొప్పను ప్రదర్శిస్తూ చేయు తపస్సు రాజసికం.దీని ఫలితం కూడా అల్పమే.
పరులకు హాని కల్గించు ఉద్దేశ్యంతో తనను తాను హింసించుకుంటూ,మూర్ఖఫు పట్టుదలతో చేయు తపస్సు తామసికం.
పుణ్యస్థలాలలో దానం,పాత్రతను బట్టి దానం,తనకు సహాయపడలేని వారికి దానం చేయడం సాత్వికం.
ఉపకారం ఆశించి,ప్రతిఫలం కోరుతూ కష్టపడుతూ ఐనా చేసే దానం రాజసదానం.
అపాత్రదానం,అగౌరవం చే చేసే దానం తామసదానం.
'ఓం''తత్"'సత్"అనే మూడు సంకేతపదాలు బ్రహ్మజ్ఞతకు సాధనాలు.వాటి వలనే వేదాలు,యజ్ఞాలు,బ్రాహ్మణులూ కల్పించడం జరిగింది.
అందుచేతనే యజ్ఞ,దాన,తపోకర్మలన్నీ 'ఓం'కారపూర్వకం గానే చేస్తారు.
మోక్షం కోరువారు ప్రయోజనం కోరకుండా చేసే యాగ,దాన,తపోకర్మలన్నీ "తత్"శబ్దం చే చేయబడుతున్నాయి.
"సత్" శబ్దము కు ఉనికి,శ్రేష్టము అని అర్థం.నిశ్చలనిష్ట,పరమాత్ముని గూర్చి చేసే అన్ని కర్మలు కూడా "సత్"అనే చెప్పబడుతున్నాయి.
శ్రద్దలేకుండా ఏమి చేసినా "అసత్" అనే చెప్పబడతాయి.వాటివలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.

దైవాసుర సంపద్వభాగ యోగము(16వ అధ్యాయం)

శ్రీకృష్ణుడు చెపుతున్నాడు.
దైవగుణాలు:
భయం లేకుండడం,నిర్మల మనసు,అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ,ఆత్మనిగ్రహం,యజ్ఞాచరణ,వేదాధ్యయనం, తపస్సు,సరళత,అహింస,సత్యం,కోపం లేకుండడం,త్యాగం,శాంతి,దోషాలు ఎంచకుండడం, మృదుత్వం,భూతదయ,లోభం లేకుండడం,అసూయ లేకుండడం,కీతి పట్ల ఆశ లేకుండడం.
రాక్షసగుణాలు:
గర్వం,పొగరు,దురభిమానం,కోపం,పరుషత్వం,అవివేకం.

దైవగుణాలు మోక్షాన్ని,రాక్షసగుణాలు సంసారబంధాన్ని కలిగిస్తాయి.నీవు దైవగుణాలు కలిగినవాడివి, బాధపడద్దు.
దైవ,రాక్షస స్వభావులని రెండు రకాలు.రాక్షసస్వభావం గురించి చెప్తాను.
మంచీచెడుల విచక్షణ,శుభ్రత,సత్యం,మంచి ఆచారం వీరిలో ఉండవు.
ప్రపంచం మిథ్య అని,దేవుడు లేడని,స్త్రీపురుష సంయోగం చేతనే సృష్టి జరుగుతోందని కామమే కారణమని అని వాదిస్తారు.
వీరు లోకకంటకమైన పనులు చేస్తారు.కామం కలిగి దురభిమానం,డంభం,మదం,మూర్ఖ పట్టుదల కలిగి అపవిత్రంగా ఉంటారు.
కామం,కోపాలకు బానిసలై,విషయవాంఛలే ముఖ్యంగా వాటి అనుభవం కోసం అక్రమ ధనార్జన చేస్తూ నిత్యం ఆశలలో చిక్కుకొని ఉంటారు.

"ఇది నాకు దొరికింది.దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఉంది,ఇంకా వస్తుంది.ఈ శత్రువును చంపాను.మిగిలిన శత్రువులందరినీ చంపుతాను.నేను సర్వాధికారిని. బలవంతుడిని,సుఖిని,ధనికుడిని.నాకెదురు లేదు.నాకు ఎవరూ సమానం కాదు.యాగలూ,దానాలూ చేస్తాను.నేనెప్పుడూ సంతోషినే"అని అనుకుంటూ కామం,భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు.
ఆత్మస్తుతి,డబ్బు మదం తో శాస్త్రాన్ని వీడి పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు.అన్ని దుర్గుణాలు కలిగి అసూయతో అంతర్యామి నైన నన్ను తిరస్కరిస్తారు.
వీరు తిరిగితిరిగి ఇలాంటి జన్మలే పొందుతారు.వీరు ఎన్నటికీ నన్ను చేరలేక అంతకంతకూ హీనజన్మలనే పొందుతుంటారు.
కామం,కోపం,పిసినారితనం ఈ మూడూ నరకానికి తలుపులు.ఆత్మజ్ఞానమును నాశనం చేస్తాయి.కాబట్టి ఈ మూడింటినీ వదిలిపెట్టాలి.
వీటిని వదిలిన వాడే తపస్సు,యాగం మొదలగు వాటి వలన ఆత్మజ్ఞానం కలిగి మోక్షం పొందుతారు.
వేదశాస్త్రాలను లక్ష్యపెట్టని వారికి శాంతి లేక మోక్షం లభించవు.
కాబట్టి ఏ పనిచెయ్యాలి,చేయకూడదు అన్నదానికి వేదశాస్త్రాలే నీకు ప్రమాణం.వాటి ప్రకారమే నీ కర్మలను చెయ్యి.

పురుషోత్తమ ప్రాప్తి యోగము(15వ అధ్యాయం)

శ్రీకృష్ణుడు:
వ్రేళ్ళు పైకీ ,కొమ్మలు దిగువకూ ఉన్నదీ,వేద అనువాకాలే ఆకులు కలదీ ఐన అశ్వత్థవృక్షం ఒక్కటి ఉందని చెప్పబడుతున్న వృక్షాన్ని తెలిసినవాడే వేదవిదుడని తెలుసుకో.
దీని కొమ్మలు త్రిగుణాల వలనే విస్తరించి ఇంద్రియార్థాలే చిగుళ్ళు గా కల్గి,క్రిందికీ మీదికీ వ్యాపించి ఉన్నాయి.కాని మనుష్య లోకంలో కర్మానుబంధంతో దిగువకు పోయే వేళ్ళు కూడా ఉన్నాయి.
సంసారం లోని ప్రాణులు ఈ చెట్టు యొక్క స్వరూపం తెలుసుకోలేరు.ఈ సంసారవృక్షాన్ని మూలం తో పాటు వైరాగ్యంతోనే ఛేదించాలి.
దేనిని పొందితే తిరిగి సంసారం లోనికి రామో ఈ విశ్వము ఎవరి వలన సాగుతుందో అతన్ని శరణు వేడెదము అన్న భావనతో సాధన చేయాలి.
బ్రహ్మజ్ఞానులై దురహంకారం,చెడుస్నేహాలు,చెడు ఊహలు లేక కోరికలను విడిచి ద్వంద్వాతీతులైన జ్ఞానులు మాత్రమే మోక్షం పొందుతారు.
చంద్ర,సూర్య,అగ్నులు దేనిని ప్రకాశింపచేయలేరో,దేనిని పొందితే తిరిగి రానక్కరలేదో అలాంటి స్వయంప్రకాశమైనదే నా పరమపదం.
నా పురాతన అంశయే జీవుడుగా మారి,జ్ఞానేంద్రియాలను మనసుగ్నూ ఆకర్షిస్తున్నారు.
గాలి సువాసన తీసుకుపోయేట్లు జీవుడు కొత్త శరీరం పొందేటప్పుడు పూర్వశరీర భావాలను తీసుకెలుతున్నాడు.
మనసు సహాయంతో ఇంద్రియవిషయాలను జీవుడు అనుభవిస్తున్నాడు.
జీవుడి దేహాన్ని త్యజించడం,గుణప్రభావం చే మరో కొత్త దేహాన్ని పొందడం మూర్ఖులు తెలుసుకోలేరు.జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు.
ఆత్మానుభవం చేత తమ బుద్ధిలో దీనిని చూడగలుతారు.కాని చిత్తశుద్ది లేని సాధన చేత కనిపించదు.
సూర్య,చంద్ర,అగ్నుల తేజస్సు నాదే.
నా శక్తి చే,నేనే భూమియందు ప్రవేశించి సర్వభూతాలను ధరిస్తున్నాను.రసస్వరూపుడైన చంద్రూడినై అన్ని సస్యాలను పోషిస్తున్నాను.
జీవుల జఠరాగ్ని స్వరూపంతో అవి తినే నాలుగురకాల ఆహారాలను ప్రాణ,అపాన వాయువులతో కూడి నేనే జీర్ణం
చేస్తున్నాను.
నేనే అందరి అంతరాత్మను.జ్ఞాపకం,జ్ఞానం,మరుపు నావలనే కలుగుతున్నాయి.నేనే వేదవేద్యుడను,వేదాంతకర్తను,వేదవేత్తనూ కూడా అయి ఉన్నాను.
క్షర,అక్షర అని రెండు రకాలు.ప్రపంచభూతాలన్నీ క్షరులనీ,కూటస్థుడైన నిర్వికల్పుడు మాత్రమే అక్షరుడు.
వీరిద్దరికంటే ఉత్తముడు పరమాత్మ.అతడే మూడు లోకాలను పోషిస్తోన్న అక్షయుడూ,నాశనం లేనివాడు.
అందువలనే పరమాత్మ వేదాలలో పురుషోత్తమునిగా కీర్తింపబడ్డాడు.
భ్రాంతిని వదిలి,నన్నే పరమాత్మగా తెలుసుకొన్నవాడు సర్వజ్ఞుడై,అన్నివిధాలా నన్నే సేవిస్తాడు.
అర్జునా!అతిరహస్యమైన ఈ శాస్త్రాన్ని నీ నిమిత్తమై చెప్పాను.దీనిని గ్రహించినవాడు జ్ఞానియై,కృతార్థుడవుతాడు.

గుణత్రయ విభాగ యోగం(14వ అధ్యాయం)

భగవానుడు:
మునుల మోక్షకారణమైన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను విను.దీనిని ఆచరించినవారు నా స్వరూపాన్ని పొంది జననమరణాలను అతిక్రమిస్తారు.
మూడుగుణాలు కల్గిన "మాయ" అనే ప్రకృతి అనే గర్భంలో క్షేత్రబీజాన్ని నాటగా సర్వభూత ఉత్పత్తి జరుగుతోంది.అన్ని జీవరాసులకూ ప్రకృతే తల్లి,నేనే తండ్రి.
ప్రకృతి సత్వ,రజో,తమోగుణాలచే కూడి ఉంటుంది.నిర్వికార జీవికి ప్రకృతి సహవాసం కల్గినప్పుడు ఈ గుణాలకు బద్దుడవుతున్నాడు.
సత్వ గుణం పరిశుద్దమైనది.అది పాపాలనుండి దూరం చేస్తుంది.ఈ గుణం కలిగినవారు సౌఖ్యం,జ్ఞానం చే బంధితులు అవుతారు.
రజోగుణం కామ,మోహ,కోరికల కలయిక చేత కలుగుతోంది.ఈ గుణం కల్గిన జీవుడు కర్మలచే బంధితులు అవుతారు.
అజ్ఞానం చేత పుట్టు తమోగుణం జీవులను భ్రాంతిలో ముంచివేస్తోంది.సోమరితనం,నిద్ర,పొరపాటు అనేవాటితో బంధితులను చేస్తుంది.
సత్వగుణం జీవున్ని సుఖబద్దుడిగా,రజోగుణం పనిచేయువానిగా,తమోగుణం ప్రమాదకారిగా చేస్తుంది.
ఒక్కొక్కప్పుడు ఒక్కో గుణం ఆధిపత్యం వహిస్తుంది.
సర్వేంద్రియాలు జ్ఞానకాంతిచే ప్రకాశిస్తున్నప్పుడు సత్వగుణం ఉందని,
లోభం,అశాంతి,ఆశలు ఉన్నప్పుడు రజోగుణం,
సోమరితనం,ప్రమాదం,మూర్ఖత్వం ఉన్నప్పుడు తమోగుణం ఉన్నాయని తెలుసుకో.
సత్వగుణం తో ఉన్నప్పుడు మరణించిన బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమలోకాలు,రజోగుణం ఉన్నప్పుడు మరణిస్తే మానవజన్మ,తమోగుణం ఉన్నప్పుడు చనిపోయినవాడు పశుపక్ష్యాదుల జన్మ పొందుతారు.
సత్వకర్మల వలన నిర్మల సౌఖ్యం,రాజస కర్మల వలన దుఃఖం,తామసకర్మల వలన అవివేకం కలుగుతాయి.
సత్వగుణం వలన జ్ఞానం,రజోగుణం వలన లోభం,తమోగుణం వలన అజ్ఞానం,భ్రాంతి,ప్రమాదాలు ఏర్పడుతాయి.
అన్ని పనుల యందూ త్రిగుణాలే కర్తలనీ,పరమాత్మ వీటికి అతీతుడని తెలుసుకొన్నవాడు నా భావం పొందుతాడు.
జీవి వీటిని దాటినప్పుడే బ్రహ్మానందం పొందగలడు.
అర్జునుడు:
వీటిని అతిక్రమించినవారి లక్షణాలు ఏవి?అసలు ఎలా వీటిని దాటాలి?

కృష్ణుడు:
ఈ గుణాల ఫలితాలు లభిస్తే ద్వేషింపక,లభించనప్పుడు ఆశింపక,సాక్షిగా,తను ఏమీ చేయడం లేదనుకొంటూ,తన అసలు స్వభావం గ్రహించి,సుఖదుఃఖాలను,మట్టీ,రాయి,బంగారు లను సమానంగా చూస్తూ,ప్రియము,అప్రియముల పైన సమాన దృష్టి కల్గి,ధీరుడై,పొగడ్తలు,నిందలు,మానము,అవమానము,శత్రుమిత్రులందు లందు సమబుద్ధి కల్గి,నిస్సంకల్పుడై ఉన్నవాడు గుణాతీతుడు.
నిత్యమూ నన్నే నిశ్చలభక్తి తో సేవించేవాడు,త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు.
పరమాత్మకు,మోక్షధర్మాలకు,సచ్చిదానందానికీ,నిరాకార బ్రహ్మానికి నేనే మూలము.

క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము(13 వ అధ్యాయం)

అర్జునుడు:
ప్రకృతి,పురుషుడు,క్షేత్రం,క్షేత్రజ్ఞుడు,జ్ఞానము,జ్ఞేయము అనగా ఏమిటి?
కృష్ణుడు:
దేహాన్ని క్షేత్రమని,దీనిని తెలుసుకొన్నవాన్ని క్షేత్రజ్ఞుడని అంటారు.
నేనే క్షేత్రజ్ఞున్ని.క్షేత్రక్షేత్రజ్ఞులను గుర్తించడమే నిజమైన మతం.
వీటి గురించి క్లుప్తంగా చెప్తాను విను.
ఋషులు అనేకరకాలుగా వీటిగురించి చెప్పారు.బ్రహ్మసూత్రాలు వివరంగా చెప్పాయి.
పంచభూతాలు,అహంకారం,బుద్ధి,ప్రకృతి,కర్మేంద్రియాలు,జ్ఞానేంద్రియాలు,మనసు, ఇంద్రియవిషయాలైన శబ్ద,స్పర్శ,రూప,రుచి,వాసనలు,ఇష్టద్వేషాలు,తెలివి,ధైర్యం ఇవన్నీ కలిసి క్షేత్రమని క్లుప్తంగా చెప్పారు.

అభిమానము,డంబము లేకపోవడం,అహింస,ఓర్పు,కపటం లేకపోవడం,గురుసేవ,శుచిత్వం,నిశ్చలత,ఆత్మనిగ్రహం,ఇంద్రియ విషయాలపై వైరాగ్యం,నిరహంకారం,ఈ సంసార సుఖదుఃఖాలను నిమిత్తమాత్రుడిగా గుర్తించడం,భార్యాబిడ్డలందు,ఇళ్ళుల యందు మమకారం లేకపోవడం,శుభాశుభాల యందు సమత్వం,అనన్య భక్తి నాయందు కల్గిఉండడం,ఏకాంతవాసం,నిరంతర తత్వ విచారణ వీటన్నిటిని కలిపి జ్ఞానం అని చెప్పబడతోంది.దీనికి వ్యతిరేకమైనది అజ్ఞానం.

సత్తు లేక అసత్తు అని చెప్పలేని సనాతన పరబ్రహ్మం ను తెలుసుకొంటే మోక్షం వస్తుంది.ఈ విశ్వమంతా అదే వ్యాపించి ఉంది.
ఈ పరబ్రహ్మతత్వం అన్నిటియందు కలిసిఉన్నట్లు కనిపించినా దేనితోనూ కలవదు.కాని అన్నిటినీ భరిస్తూ పోషిస్తోంది.నిర్గుణమై ఉండీ గుణాలను అనుభవించేదీనని తెలుసుకో.

అది సర్వభూతాలకూ లోపలా,బయట కూడా ఉంది.అది సూక్షం.తెలుసుకోవడం అసాధ్యం.గుర్తించిన వారికి సమీపంలోనూ,మిగతావారికి దూరంలో ఉంటుంది.
ఆ పరమాత్మ అఖండమై ఉన్నప్పటికీ అన్ని జీవులలోనూ విభజింపబడి ఉన్నట్లు కనపడుతుంది.సృష్టిస్థితిలయకారకం అదే.
అది సూర్యుడు,అగ్నులకు తేజస్సును ఇస్తుంది.చీకటికి దూరంగా ఉంటుంది.అదే జ్ఞానం,జ్ఞేయం,సర్వుల హృదయాలలో ఉండేది.
జ్ఞానం,జ్ఞేయం,క్షేత్రం ఈ మూడూ తెలుసుకొన్న వాడు భక్తుడై మోక్షం పొందగలడు.
ప్రకృతిపురుషులు తెలియబడని మొదలు గలవి.దేహేంద్రియ వికారాలు,త్రిగుణాలు,సుఖదుఃఖాలు ప్రకృతి వలనే పుడుతున్నాయి.
దేహ,ఇంద్రియాల పనికి ప్రకృతి-సుఖదుఃఖాల అనుభవానికి పురుషుడు మూలం.
జీవుడు త్రిగుణాల వలన సుఖదుఃఖాలు అనుభవిస్తున్నాడు.వివిధ జన్మలకు గుణాల కలయికే కారణం.
తాను ఈ శరీరమందే ఉన్నప్పటికీ దీనికి అతీతుడు,స్వతంత్రుడు,అనుకూలుడు,సాక్షి,పోషకుడు,భోగి ఐన పరమాత్మ అని చెప్పబడుతున్నాడు.
ఈ విషయాలను గురించి బాగా తెలుసుకొన్నవాడు ఏ కర్మలు చేసినా తిరిగి జన్మించడు.
కొందరు ఆ పరమాత్మను పరిశుద్ధ సూక్ష్మబుద్దితో హృదయంలోనూ,మరికొందరు యోగధ్యానం వలనా,జ్ఞానయోగం వలనా,కొందరు నిష్కామయోగం ద్వారా దర్శిస్తున్నారు.
ఈ ఆత్మజ్ఞానం తెలియనివారు తత్వజ్ఞానుల వద్ద ఉపాసన చేస్తున్నారు.వీరు కూడా సంసారాన్ని తరిస్తారు.
ఈ ప్రాణులంతా క్షేత్రక్షేత్రజ్ఞుల కలయిక కారణం.
అన్నీ నశించినా తాను నాశనం కానట్టి ఆ పరమాత్మను చూడగలిగినవాడు మాత్రమే నిజంగా చూసినవాడు.
ఆ దైవాన్ని అంతటా సమంగా చూసేవాడు తనను తాను పాడుచేసుకోడు.పరమగతిని పొందుతాడు.
ఆత్మ ఏ కర్మా చేయదనీ,ప్రకృతే చేస్తుందని తెలుసుకొన్నవాడే జ్ఞాని.
అన్ని జీవులనూ ఆత్మగా చూస్తూ ఆనీ ఆత్మ అని గ్రహించిన మనిషే బ్రహ్మత్వం పొందుతాడు.
పుట్టుక,గుణం,వికారం లేనిది కావడం చే శరీరమందున్నా కర్తృత్వంకానీ,కర్మఫల సంబంధం గాని తనకు ఉండవు.
శరీరగుణాలు ఆత్మకు అంటవు.ఒక్క సూరుయ్డే జగత్తును ప్రకాశింప చేస్తున్నట్టు క్షేత్రజ్ఞుడైన పరమాత్మ క్షేత్రాలైన అన్ని దేహాలనూ ప్రకాశింప చేస్తున్నాడు.
క్షేత్రక్షేత్రజ్ఞుల భేదాన్ని,మాయాబంధాన్ని దాటే ఉపాయాన్ని తన జ్ఞాననేత్రం వలన తెలుసుకొన్నవాడే పరమగతినీ పొందుతాడు.

భక్తి యోగము(12 వ అధ్యాయం)

అర్జునుడు:
సగుణారాధకులు,నిర్గుణారాధకులు వీరిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు?
కృష్ణుడు:
నిత్యం తమ మనసులో నన్నే ఏకాగ్రచిత్తంతో ఉపాసించే భక్తులే శ్రేష్ఠులు.నిరాకార నా రూపాన్ని పూజించువారు ద్వంద్వాతీతులు.ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వ్యవ్యాపము నిశ్చలము,నిత్యసత్యము ఐన నా నిరాకారమును పూజించువారు కూడా నన్నే పొందుతారు.
సగుణోపాసన కన్న నిర్గుణోపాసన శ్రేష్ఠము.దేహాభిమానం కల్గిన వారికి అవ్యక్తమైన నిర్గుణబ్రహ్మము లభించడం కష్టం.
ఎవరైతే సర్వకర్మఫలాలు నాకు సమర్పించి,నాను ఏకాగ్రతతో ధ్యానిస్తారో వారు మృత్యురూపమైన సంసారాన్ని తరింపచేస్తాను.
మనసును,బుద్దిని నా యందే లగ్నం చేసి ధ్యానిస్తే నీవు నా యందే ఉంటావు.మనసు లగ్నం చేయడం కాకపోతే అభ్యాసయోగంతో ప్రయత్నించు.అది కూడా కష్టమైతే నాకు ఇష్టమైన పనులు చెయ్యి.అది కూడా సాధ్యం కానిచో నన్ను శరణు పొంది నీ సర్వ కర్మఫలాలు నాకు సమర్పించు.
అభ్యాసం కంటే జ్ఞానం ,అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫలత్యాగం శ్రేష్ఠం.త్యాగం వలనే శాంతి కలుగుతుంది.
సర్వప్రాణులందూ ద్వేషం లేనివాడై,స్నేహం,దయను కలిగి,దేహేంద్రియాల పైన మమకారం లేని వాడై,సుఖదుఃఖాలు లేనివాడై,ఓర్పు కలిగి,నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై మనసును,బుద్దిని నా యందు నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు.
లోకాన్ని భయపెట్టక,తాను లోకానికి భయపడక,ఆనంద ద్వేష భయచాంచల్య రహితుడైన వాడు నాకు ఇష్టుడు.
కోరికలు లేక,పరిశుద్దుడై,సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ కర్మఫలితాల పైన ఆశలేనివాడు నాకు ఇష్టుడు.
సంతోషం,దుఃఖం,ద్వేషం,శుభాశుభములను వదిలినవాడు నాకు ప్రియుడు.
శత్రుమిత్రుల యందు సమానదృష్టిగలవాడు,మాన,అవమానములందు,చలి,వేడి యందు,సుఖదుఃఖాలందు సమదృష్టి గలవాడు,కోరికలు లేనివాడు,దొరికినదానితో తృప్తిచెందేవాడు,మౌనియై,స్థిరనివాసం లేక,స్థిరచిత్తం కలిగిన భక్తుడే నాకు ప్రియుడు.
పైన చెప్పిన ధర్మాన్ని నమ్మి ఆచరించి నన్ను ఉపాసించేవాడు నాకు అత్యంత ఇష్టుడు.

Saturday, September 20, 2008

విశ్వరూపసందర్శన యోగం(11 వ అధ్యాయం)

అర్జునుడు:
దయతో నీవు చెప్పిన రహస్య జ్ఞానం వలన నా మోహం నశిస్తోంది.నీ మహాత్మ్యం గురించి ఎంతో కరుణతో చెప్పావు.నీ విస్వరూపం చూడాలని ఉంది.నాకు అర్హత ఉందనుకుంటే దయచేసి చూపించు.
శ్రీకృష్ణుడు:
అనేక విధాలైన,వర్ణాలు కల్గిన నా అలౌకిక దివ్యరూపం చూడు. ఆదిత్యులు,వసువులు,రుద్రులు,దేవతలు మొదలైన నీవు చూడనిదంతా నాలో చూడు.నీవు చూడాలనుకున్నదంతా చూడు.సామాన్య దృష్టి తో నీవు చూడలేవు కావున దివ్యదృష్టి ఇస్తున్నాను.చూడు.
సంజయుడు:
ధృతరాష్ట్ర రాజా!అనేక ముఖాలతో,నేత్రాలతో,అద్భుతాలతో,ఆశ్చర్యాలతో దేదీప్యమానంగా,వేయిసూర్యుల వెలుగును మించిన తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు.
జగత్తు మొత్తం కేవలం అతని శరీరంలో ఉన్న ఒకే భాగంలో అర్జునుడు దర్శించాడు.
ఆశ్చర్య,ఆనందాలతో రోమాంచితుడై నమస్కరించాడు.అప్పుడు
అర్జునుడు:
హే మాహాదేవా!దివ్యమైన,ఆదీఅంతము లేని నీలో సమస్త దేవతలను,భూతగణాలను,పద్మాసనుడైన బ్రహ్మను,మహర్షులను అందరినీ చూస్తున్నాను.అన్నివైపులా చేతులతో,ముఖాలతో,కన్నులతో ఉన్న నీ విశ్వరూపాన్ని నేను చూస్తున్నాను.
అసంఖ్యాక కిరీటాలు,గదలు,చక్రాలు ధరించి సూర్యాగ్నుల తేజస్సుతో నీ రూపాన్ని చూస్తున్నాను.
తెలుసుకోవలసిన పరమాత్మవు,ప్రపంచానికి ఆధారము,శాశ్వతుడవు,ధర్మరక్షకుడవు,పరబ్రహ్మంవు నువ్వే అని నిశ్చయించుకున్నాను.
ఆధిమధ్యాంతరహితము,అపరిమిత శక్తియుతము,అనంత బాహువులతో సూర్యచంద్రులే కన్నులుగా ప్రజ్వలితాగ్నిలా గల ముఖకాంతి గలది,తన తేజస్సుతో సమస్త విశ్వాన్ని తపింపచేస్తున్న నీ రూపాన్ని అర్థం చేసుకుంటున్నాను.
సూదిమొన సందు లేని నీ మహోగ్రరూపం చూసి ముల్లోకాలు భయంతో వణుకుతున్నాయి.
సమస్తదేవతా స్వరూపాలు నీలో ప్రవేశిస్తున్నాయి.ఋషులు,సిద్దులు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నారు.
అన్నిలోకాల వాసులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నాయి.
నీ భయంకర విశ్వరూపాన్ని చూసి అన్ని లోకాలు,నేను భయపడుతున్నాము.
నీ విశాల భయంకర నేత్రాలు జ్వలిస్తున్నాయి.నిన్ను చూస్తున్నకొద్ది నా మనసు చలించి ధైర్యం నశించిపోతోంది.నాకు శాంతి లేదు.
కాలాగ్నిలా ఉన్న నిన్ను చూసి నేను భయపడిపోతున్నాను.నన్ను కరుణించు.
అనేకమంది రాజులు,కౌరవులు,భీష్మద్రోణులు,కర్ణుడు నా యోధులు కూడా నీ భయంకరముఖం లోనికి వెళ్తున్నారు.వారిలో కొందరు నీ కోరల మధ్య నలిగి చూర్ణమై పోతున్నారు.
నదులు సముద్రంలో కలుస్తున్నట్లు రాజలోకమంతా నీ భయంకర ముఖాగ్ని లోనికి పొర్లుతోంది.
అన్ని లోకాలు నీ ముఖంలోనికి పడి నాశనమవుతున్నాయి.
నీవు అంతా మింగి వేస్తున్నావు.జగత్తు భయపడుతోంది.ఇంత భయంకరమైన నీవెవరవు?తెలియజెయ్యి.
శ్రీకృష్ణుడు:
సర్వస్వం లయం చేసే కాల స్వరూపుడిని నేను.ప్రస్తుతం నా పని సంహారం.నీవు యుద్ధం మానినా సరే నీవు,కొందరు తప్ప ఇక్కడ ఎవరూ మిగలరు.
లే! యుద్ధానికి సిద్దపడు.శతృసంహారం చేసి భూమండలాన్ని అనుభవించు.నిమిత్తమాత్రుడవై యుద్ధం చేయి.ద్రోణ,భీష్మ,జయద్రథ,కర్ణాదులు అందరినీ ముందే చంపివేశాను.నాచే చంపబడినవారినే నువ్వు చంపబోతున్నావు.యుద్ధం చెయ్యి.జయిస్తావు.
అర్జునుడు:
నీ కీర్తన చేత జగం ఆనందిస్తోంది,రాక్షసులు భయంచే దిక్కు తోచక పరుగెడుతున్నారు.సిద్దులు నీకు మ్రొక్కుతున్నారు.సత్తుకు,అసత్తుకు,బ్రహ్మకు మూలపురుషుడైన నిన్ను నమస్కరించనివారెవరు ఉంటారు?
ఆదిదేవుడవు,సనాతనుడవు,అంతా తెలిసినవాడవు,సర్వ జగద్వ్యాపివి.
బ్రహ్మ కన్నతండ్రివి,అగ్ని,వరుణుడు అన్నీ నీవే.నీకు నా పునఃపునః నమస్కారాలు.
నిన్ను అన్నివైపుల నుండి నమస్కరిస్తున్నాను.
నీ మహిమను గుర్తించలేక చనువుతో కృష్ణా,సఖా,యాదవా అంటూ నిన్ను పిలిచాను.సరసాలాడాను.క్షమించు.
నీకు సమానుడైన వాడే లేనప్పుడు నీ కన్నా అధికుడెలా ఉంటాడు?
తండ్రి కొడుకుని,ప్రియుడు ప్రియురాలిని,మిత్రుడు మిత్రుని తప్పులు మన్నించినట్లు నన్ను మన్నించు.నీ ఈ రూపం చూసి భయం కల్గుతోంది.నీ శంఖ,చక్ర,కిరీట,గదాపూర్వకమైన మునుపటి రూపంలోనికి రా.
కృష్ణుడు:
నీ మీది కరుణతో నా తేజ విశ్వరూపాన్ని చూపించాను.నీవొక్కడు తప్ప పూర్వం ఈ రూపాన్ని ఎవరూ చూడలేదు.
వేదాలు చదివినా,దానధర్మాలు,జపాలు,కర్మలు చేసినా ఎవరూ చూడలేకపోయారు.నీవు భయపడవద్దు.నా పూర్వరూపమే చూడు అంటూ సాధారణ రూపం చూపించాడు.
అర్జునుడు:
ఇప్పుడు నా మనసు కుదుటపడింది.
కృష్ణుడు:
దేవతలు కూడా చూడాలని తపించే ఈ రూపదర్శనం తేలిక కాదు.
వేదాలు చదివినా,దానాలు,పూజలు,తపస్సు చేసినా ఈ రూప దర్శనం కలుగదు.
అనన్యభక్తితో మాత్రమే సాధ్యం అవుతుంది.
నా కొరకే కర్మలు చేస్తూ,నన్నే నమ్మి,నాయందు భక్తి కల్గి విశ్వంలో నిస్సంగుడైనవాడు మాత్రమే నన్ను పొందగలడు.

విభూతి యోగము(10 వ అధ్యాయం)

కృష్ణుడు:
నా మాటలు విని ఆనందపడుతున్నావు కాబట్టి నీ మంచి కోరి నేచెప్పేది విను.
నా ఉత్పత్తిని ఎవరూ కనుగొనలేరు.ఎందుకంటే నేనే అన్నిటికీ కారణం.నాకు మొదలుచివరా లేవు.సర్వలోకాలకు నేనే ప్రభువునని తెల్సుకొన్న వాళ్ళు మోక్షం పొందుతారు.
అన్ని గుణాలు,ద్వంద్వాలు(సుఖదుఃఖాలు,జయాపజయాలు మొదలగునవి) అన్నీ నా వలనే కలుగుతున్నాయి.
సనకసనందాదులు,సప్తర్షులు,పదునాలుగు మనువులు నా సంకల్పంవలన జన్మించి సమస్త ప్రాణులను సృష్టించారు.
నా విభూతిని,యోగాన్ని తెలుసుకొన్నవారు యోగయుక్తులు అవుతారు.
నేనే మూలకారణం అని తెలుసుకొన్న జ్ఞానులు నన్నే సేవిస్తూ తమ ప్రాణాలను,మనసును నాయందే నిలిపి ఇంద్రియనిగ్రహులై నా లీలలను చెప్పుకుంటూ నిత్యసంతోషులై ఉంటారు.
నన్ను సేవించేవాళ్లకి నన్ను పొందే జ్ఞానం నేనే కల్గిస్తాను.వారిని కరుణించేందుకై నేనే వారి బుద్ధిలో ఉండి జ్ఞాన దీపంచే అజ్ఞాన చీకటిని తొలగిస్తాను.

అర్జునుడు:
నువ్వు శాశ్వతుడని,పరమాత్ముడనీ,ఆది అనీ ఋషులు,వ్యాసుడు అందరూ,నువ్వూ అంటున్నారు.నేనూ నమ్ముతున్నాను.నిన్ను నువ్వుతప్ప ఇతరులు తెలుసుకోలేరు.ఏఏ వస్తువులందు ఏ విధంగా నిన్ను ధ్యానిస్తే నిన్ను తెలుసుకోగలవో చెప్పు.వివరంగా చెప్పు.
కృష్ణుడు:
నా విభూతులు అన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు.ఎందుకంటే అవి అనంతం.కొన్ని ముఖ్యమైనవి చెప్తాను విను.
అన్ని ప్రాణుల ఆత్మను,సృష్టిస్థితిలయాలు,ఆదిత్యులలో విష్ణువును,జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడను,మరుత్తులలో మరీచి,చంద్రుడను,వేదాలలో సామవేదం,దేవతలలో ఇంద్రుడను,ఇంద్రియాలలో మనసును,ప్రాణుల చైతన్యశక్తిని,రుద్రులలో శంకరుడు,యక్షరాక్షసులలో కుబేరుడను,వసువులలో పావకుడు,పర్వత శిఖరాలలో మేరువు,పురోహితులలో బృహస్పతి,సేనాధిపతులలో కుమారస్వామిని,సరస్సులలో సముద్రాన్ని,మహర్షులలో భృగువు,వ్యాకరణంలో ఒంకారం,యజ్ఞాలలో జపయజ్ఞం,స్థావరాలలో హిమాలయం,వృక్షాలలో రావి,దేవర్షులలో నారదుడు,గంధర్వులలో చిత్రరథుడు,సిద్దులలో కపిలుడు,గుఱ్ఱాలలో ఉచ్చైశ్శ్రవం,ఏనుగులలో ఐరావతం,మానవులలో మహారాజు,ఆయుధాలలో వజ్రాయుధం,గోవులలో కామధేనువు,ఉత్పత్తి కారకులలో మన్మథుడు,పాములలో వాసుకి నేనే.

నాగులలో అనంతుడు,జలదేవతలలో వరుణుడు,పితృదేవతలలో ఆర్యముడు,శాసకులలో యముడు,రాక్షసులలో ప్రహ్లాదుడు,కాలం,మృగాలలో సింహం,పక్షులలో గరుత్మంతుడు,వేగము కల వాటిలో వాయువు,శస్త్రధారులలో శ్రీరాముడు,జలచరాలలో మొసలి,నదులలో గంగానది,సృష్టికి ఆదిమధ్యాంతాలు నేనే.వాదాలు కూడా నేనే.
అక్షరాలలో అకారాన్ని,సమాసాలలో ద్వంద్వసమాసం,సర్వకర్మ ఫలప్రదాత,మ్రుత్యువూ,సృజనా,స్త్రీ శక్తులలో కీర్తీ,లక్ష్మిని,వాక్కును,స్మృతీ,మేధ,ధృతి,క్షమ నేనే.
సామములలో బృహత్సామం,ఛందస్సులలో గాయత్రి,నెలలలో మార్గశిరము,ఋతువులలో వసంతమూ నేనే.
వంచనలలో జూదాన్ని,తేజోవంతులలో తేజం,విజయం,కృషి చేయువారి ప్రయత్నం,సాత్వికుల సత్వగుణం,యాదవులలో వాసుదేవుడను,పాండవులలో అర్జునుడను,మునులలో వ్యాసుడు,కవులలో శుక్రుడను నేనే.
దండించేవారి దండనీతి,జయించేవారి రాజనీతి,రహస్యాలలో మౌనం,జ్ఞానులలో జ్ఞానం నేనే.
సర్వభూతాలకు బీజకారణం నేనే.నేను కానిది ఏదీ లేదు.
నా విభూతులు అనంతం.కాబట్టి సంగ్రహంగా చెప్పాను.
ఐశ్వర్యంతోను,కాంతితోను,ఉత్సాహంతోను కూడినవన్నీ నా తేజస్సు యొక్క అంశలని తెలుసుకో.
ఇన్ని మాటలు దేనికి? నా తేజస్సులోని ఒకేఒక్క కళ మాత్రం చేతనే ఈ ప్రపంచమంతా నిండి ఉన్నదని గ్రహించు.

రాజవిద్యా రాజగుహ్య యోగము(9వ అధ్యాయము)

కృష్ణుడు:
అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని నీకు చెప్తాను విను. ఈ విద్య రహస్యము,ఉత్తమం,ఫలప్రదం,ధర్మయుక్తం,సులభము,శాశ్వతం.
దీన్ని పాటించనివారు పుడుతూనే ఉంటారు.
నిరాకారుడనైన నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను.అంతా నాలోనే ఉంది.నేను వాటియందు లేను. జీవకోటి నన్ను ఆశ్రయించిలేదు.నా ఈశ్వర శక్తిని చూడు.నేనే అంతా సృష్టించి పోషిస్తున్నప్పటికీ వాటిని ఆశ్రయించి ఉండను.ప్రాణులన్నీ నాయందే ఉన్నాయి.
ప్రళయకాలంలో అన్ని ప్రాణులూ నా మాయలోనే లయమవుతాయి,సృష్టి మొదలులో నా మాయతో తిరిగి పుట్టిస్తాను.
అయినా నేను తటస్థంగా ఉండడం వలన ఆ కర్మలు నన్ను అంటవు.
నా సంకల్పం చేతనే నా మాయ సృష్టి కార్యం చూస్తోంది.
నా తత్వం తెలియని వాళ్ళూ నన్ను సామాన్యుడిగా భావించి తిరస్కరిస్తారు.
అలాటివాళ్ళూ వ్యర్థ కర్మలతో,దురాశలతో అజ్ఞానంచే రాక్షసభావాలకు గురి అవుతున్నారు.
మహాత్ములు నా తత్వం తెలుసుకొని నిశ్చలభక్తి తో నన్ను సేవిస్తున్నారు.
కొందరు జ్ఞానయోగులు ద్వైత,అద్వైత పద్దతులలో నన్ను ఉపాసిస్తున్నారు.
యజ్ఞమూ,దానికి ఉపయోగపడు పదార్థాలూ,ఫలితము,అగ్ని అన్నీ నేనే.
తల్లి,తండ్రి,తాత,తెలుసుకోదగినవాడు,వేదాలు,ఓంకారము అన్నీ నేనే.
ఆశ్రయము,ప్రభువు,సాక్షి,ఆధారము,హితుడు,కారణము నేనే.
కరువు,సస్యశ్యామలం,మృత్యువు,అమృతం,సత్,అసత్ అన్నీ నేనే.
స్వర్గం పొందాలనే కోరికతో కర్మలు చేసేవాళ్ళూ అది పొంది భోగాలు అనుభవించి పుణ్యఫలం క్షీణించగానే మళ్ళీ భూలోకంలో పుడతారు.
నిరంతరము నా ధ్యాసలోనే ఉంటూ,నన్నే ఉపాసించే వారి యోగక్షేమాలను నేనే చూసుకుంటాను.
శ్రద్దాభక్తులతో ఇతర దేవతలను పూజించేవారు కూడా నన్ను పూజించేవారే అగుచున్నారు.కాని అది చుట్టుమార్గం.
వారు నా స్వరూపాన్ని తెలుసుకోకపోవడం వలన పునర్జన్మలు పొందుతున్నారు.
దేవతలను పూజించేవారు దేవలోకాన్ని,పితరులను పూజించేవారు పితృలోకాన్ని,భూతాలను పూజించేవారు భూతలోకాన్ని పొందుతారు.నన్ను సేవించేవాళ్ళు నన్నే పొందుతారు.
భక్తితో సమర్పించే ఆకు కానీ,పువ్వు కానీ,పండు కాని ,నీళ్ళైనా కాని నేను ప్రేమతో స్వీకరిస్తాను.
నువ్వు చేయు పని,భోజనం,హోమం,దానం,తపం అన్నీ నాకూ సమర్పించు.అప్పుడు కర్మల నుండి విముక్తుడవై నన్ను పొందుతావు.
ఇష్టము,అయిష్టము అన్న భేదం నాకు లేదు.అంతా సమానమే.నాను భజించువారిలో నేను,నాలో వారు ఉంటాము.
స్థిరభక్తితో సేవించువారు ఎంత దురాచారులైనా వారు సాధువులే.అలాంటివారు తొందరగానే పరమశాంతి పొందుతారు.నా భక్తుడు ఎన్నడూ చెడిపోడని ప్రతిజ్ఞ గా చెప్పవచ్చు.
పాపులైనా కానీ,స్త్రీ,వైశ్య,శూద్రులైనా కాని నన్ను ఆశ్రయిస్తే నిశ్చయంగా మోక్షం పొందుతారు.
నాయందు మనసు నిల్పి,నా భక్తుడవై,నన్నే సేవించు.నన్నే నమ్మి,నాకే నమస్కరిస్తూ,నాయందే దృష్టి నిలిపితే నన్ను పొందితీరుతావు.

అక్షరపరబ్రహ్మయోగము(8 వ అధ్యాయము)

అర్జునుడు:

కృష్ణా బ్రహ్మము,ఆధ్యాత్మము,కర్మ,అధిభూతం,అధిదైవము అనగా ఏమిటి?ఈ దేహంలో అధియజ్ఞుడు అంటే ఎవరు?అతడెలా ఉంటాడు?యోగులు మరణసమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు.

భగవానుడు:

నాశనంలేనిదీ,సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.ప్రకృతి సంబంధమైన స్వబావాలే ఆధ్యాత్మము.భూతాల ఉత్పత్తి కైన సంఘటనయే ధర్మము.నాశనమయ్యే పదార్థము అధిభూతం.పురుషుడు అధిదైవతం.అంతర్యామి ఐన నేనే అధియజ్ఞుడిని.

మరణమందు కూడా ఎవరైతే నన్నే తలచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు నన్నే పొందుతాడు.ఎవడు అంత్యకాలంలో ఏ భావంతో మరణిస్తాడో ఆ భావాన్నే పొందుతాడు.

కాబట్టి నన్నే స్మరిస్తూ యుద్దం చెయ్యి.అన్యచింతనలు లేని మనసుతో పరమాత్మను ధ్యానించేవాడు అతడినే పొందుతాడు.

ఎవడైతే అంత్యకాలంలో ప్రాణవాయువును భౄమధ్యంలో నిలిపి పురాణపురుషుడు,అణువుకంటే అణువు,అనూహ్యమైనవాడు సూర్యకాంతితేజోమయుడు ఐన పరమాత్మున్ని ధ్యానిస్తాడొ అతడు ఆ పరమాత్మనే పొందుతాడు.

వేదవేత్తలు,నిష్కాములు కోరుకునేదాన్ని క్లుప్తంగా చెప్తాను.నవద్వారాలను బంధించి,ఇంద్రియనిగ్రహం కల్గి,మనోవృత్తులను నిరోధించి,ప్రాణాన్ని బ్రహ్మరంధ్రంలో నిలిపి ఓంకారాన్ని ధ్యానిస్తూ,నన్ను స్మరిస్తూ మరణించేవాడు పరమపదాన్ని పొందుతాడు.ఇతర అలోచనలు లేకుండా నన్నే స్మరిస్తూ నమ్ముకున్నవాడు తిరిగి ఈ దుఃఖపూరిత అశాశ్వత లోకంలో జన్మించక నన్నే పొందుతాడు.

బ్రహ్మలోకము వరకూ పునర్జన్మ ఉందికానీ నన్నుచేరినవారికి లేదు.బ్రహ్మకు వేయివేయియుగాలు ఒక పగలు,వేయియుగాలు ఒక రాత్రి.అతని పగటి కాలంలో పుట్టిన ప్రకృతి అతని రాత్రికాలంలో లయమవుతుంది.అలానే సకలజీవులు కూడా.ప్రకృతికి అతీతమైన,శాశ్వతమైన పరబ్రహ్మ మాత్రం నశించదు.అదే నా నివాస స్థానం.అది ఇంద్రియాలకు గోచరం కాదు.

సమస్తప్రాణులు ఉన్న,జగత్తు అంతా వ్యాపించి ఉన్న పరమాత్మ భక్తసులభుడు.

అగ్ని,జ్యోతి,పగలు,శుక్లపక్షం,ఉత్తరాయణ మార్గాలలో జన్మించినవారు పరబ్రహ్మను పొంది పునర్జన్మను పొందరు.

పొగ,రాత్రి,కృష్ణపక్షం,దక్షిణాయనం లలో మరణించినవారు తిరిగి జన్మిస్తారు.ఇవి తెలిసిన యోగి భ్రాంతి చెందడు.కాబట్టి యోగయుక్తుడవై ఉండు.

దీనిని గ్రహించిన జ్ఞాని వేద,యజ్ఞ,జపతపాదుల వలన కలిగే పుణ్యస్థానాన్ని అధిగమించి శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు.

విజ్ఞానయోగము(7 వ అధ్యాయము)

కృష్ణుడు:

నన్ను సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి అనే జ్ఞానము,దేన్ని తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసినది ఉండదో అటువంటి జ్ఞానాన్ని చెప్తాను విను.

వేయిమందిలో ఏ ఒక్కడో మోక్షానికి ప్రయత్నిస్తున్నాడు.అలాంటి వేయిమందిలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.

నా ఈ ప్రకృతి భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనసు,బుద్ది,అహంకారం అనే ఎనిమిది భాగాలుగా విభజింపబడిఉంది. ఈ కనబడే అపర అను ప్రకృతి కంటే పర అనబడు సమస్త విశ్వాన్ని ధరించు నా ప్రకృతి ఉత్తమమైనది.అన్నిభూతాలూ ఈ రెండు ప్రకృతులవలనే పుట్టాయి.సృష్టి,నాశనాలకు నేనే కారకుడను. నాకంటే శ్రేష్ఠమైనది లేదు.

దారమున మణులు కుచ్చబడినట్లు సమస్తము నాయందే కూర్చబడిఉంది.

నీళ్ళల్లో రుచి,సూర్యచంద్రులలో కాంతి,వేదాలలో "ఓం"కారం,ఆకాశాన శబ్దం,మనుషులలో పౌరుషం,భూమి యందు సువాసన,అగ్ని యందు తేజస్సు,జీవులందు ప్రాణం,తాపసులలో తపస్సు,అన్ని ప్రాణులకు మూలకారణం,బుద్ధిమంతులలో ధైర్యం,బలవంతులలో కామరాగాలు లేని బలం,సర్వజీవులలో ధర్మవిరుద్ధం కాని కామం నేనే.

త్రిగుణాలన్ని నా ఆధీనమే,నేను వాటికి కాదు. ప్రపంచమంతా ఈ త్రిగుణాలచే సమ్మోహితం కావడం వలన శాశ్వతున్ని ఐన నన్ను తెలుసుకోలేకపోతున్నారు.

త్రిగుణాతీతమూ,దైవతమూ ఐన నా మాయ దాటడానికి సాధ్యము కాదు.ఐనా నన్ను శరణు జొచ్చువారికి అది సులభసాధ్యము. రాక్షసభావులూ,మూఢులూ,మూర్ఖులూ,నీచులూ నన్ను పొందలేరు. ఆపదలపాలైనవాడు,తెలుసుకోగోరేవాడు,సంపదను కోరేవాడు,జ్ఞాని అను నాలుగు విధాలైన పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. వీళ్ళు నలుగురూ ఉత్తములే కాని జ్ఞాని ఎల్లపుడు నా యందే మనసు నిలుపుకొని సేవిస్తాడు కాబట్టి అతడు నాకు,అతడికి నేను చాలా ఇష్టులము మరియు అతడు శ్రేష్టుడు.

అనేకజన్మల పిదప "వాసుదేవుడే సమస్తము" అని గ్రహించిన జ్ఞాని నన్నే సేవిస్తాడు.

ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేస్తున్నాను.వారు ఆరాధించిన రూపాల దేవతలను వారు పొందుతారు.నన్ను సేవించినవారు నన్ను పొందుతారు.

నిర్వికారమూ,సర్వాతీతము ఐన నా స్వస్వరూపాన్ని గుర్తించలేక అజ్ఞానులు నన్ను మనిషిగా భావిస్తున్నారు.యోగమాయచే కూడినవాడవడం చేత నన్ను వారు తెలుసుకోలేరు. భూత,భవిష్యత్,వర్తమాన కాలాలలోని సర్వజీవులూ నాకు తెలుసు.నేనెవ్వరికీ తెలియదు. రాగద్వేషాలచే కల్గిన సుఖదుఃఖాలచే జీవులు మోహించబడుచున్నారు.పాపరహితులైన పుణ్యాత్ములు మాత్రమే నన్ను సేవించగలరు. ఎవరైతే మోక్షం కోసం నన్ను ఆరాధించి సాధన చేస్తారో వారు మాత్రమే కర్మతత్వాన్నీ,పరబ్రహ్మనూ తెలుసుకుంటారు. భూతాధిపతిని,దైవాన్ని,యజ్ఞాధిపతిని ఐన నన్ను తెలుసుకొన్నవాళ్ళూ మరణకాలంలో కూడా నన్ను మరిచిపోరు.

ఆత్మసంయమయోగము(6 వ అధ్యాయము)(ధ్యానయోగము లేక రాజయోగము)

కర్మఫలాన్ని కోరకుండా చేయవలసిన కర్మలను చేయువాడే నిజమైన సన్యాసి,యోగి.అంతేకాని అగ్నిహోత్రాదికర్మలు మానేసినంత మాత్రాన కాదు.సన్యాసమన్నా,యోగమన్నా ఒకటే. సంకల్పాలుకలవాడు యోగికాలేడు. యోగాన్ని కోరేవాడికి మొదట కర్మయే సాధనం,కొంత సాధన తర్వాత నివృత్తి(శమం)సాధనమంటారు. ఇంద్రియవిషయాలందు,వాటి కర్మలయందు కోరికలను మరియు అన్ని సంకల్పాలను వదిలినవాడే యోగిగా చెప్తారు.

ఎవరికివారే ఉద్దరించుకోవాలి కాని పతనం కాకూడదు.ఆత్మకు ఆత్మే బంధువు(నిగ్రహం కలవారికి) మరియు శత్రువు(నిగ్రహంలేని వారికి). మానావమాన,శీతోష్ణ,సుఖదుఃఖాలను సమానంగా చూసేవాడు, సంపాదించిన అనుభవ జ్ఞానం చే సంతృప్తి గలవాడు,కూటస్థుడు యుక్తుడై,యోగియై మట్టీని,రాతిని,బంగారాన్ని ఒకేలా చూస్తాడు. శత్రువులయందు,మిత్రులయందు,బంధువులు,సాధువులు,దుర్మార్గుల యందు సమబుద్దికలిగిన యోగి శ్రేష్ఠుడు.
ఆశలను వదిలి ఏకాంతప్రదేశంలో యోగాభ్యాసం చేయాలి.
ధ్యానపద్దతి:
శుభ్రమైన ప్రదేశంలో మరీ ఎత్తు లేక తగ్గు కాని పీఠంపై దర్బలు,జింక లేక పులి చర్మము,దానిపై వస్త్రం పరచి ఆసనం ఏర్పరచుకోవాలి. దానిపై నిటారుగా కూర్చుండి నాసికాగ్రం(భ్రూమధ్యం)పై చూపు కేంద్రీకరించి మనసును ఏకాగ్రంగా నిలిపి,అదుపులో ఉంచుకొని భయపడకుండా,ప్రశాంతంగా నాయందు మనసు నిలిపి నిత్యం యోగాభ్యాసం చేయువాడు నన్ను,నా స్థితినీ పొందుతాడు.
నియమాలు:
ఎక్కువగా తినరాదు.ఉపవాసం చేయరాదు.ఎక్కువగా నిద్రపోరాదు.జాగరణ చేయరాదు. అన్నిటియందు మితం కలిగినవారికి ఈ దుఃఖవినాశ యోగం సిద్దిస్తుంది. యోగసాధకుని మనసు గాలిలేనిచోట ఉంచిన దీపం వలె నిశ్చలంగా ఉంటుంది.
యోగము అనగా: ఇంద్రియాతీతము,జ్ఞానం చే మాత్రం గ్రహించబడిన అనంతసుఖానుభూతి,నిత్య ఆత్మానుభూతి,సుఖదుఃఖాలచే చలింపకుండడం,దుఃఖాలు దరిచేరని స్థితిని యోగమంటారు.
అన్ని కోరికలను వదిలి ఇంద్రియనిగ్రహంతో ప్రపంచవిషయాలనుండి బుద్దిని మరల్చి మనసును ఆత్మయందే నిలిపి అన్య ఆలోచనలను విడవాలి. చంచలమైన మనసును విషయాలపైనుండి ఆత్మ వైపుకు మరల్చాలి. ప్రశాంతమనసుగల యోగికి బ్రహ్మానందం తనకుతానే వరిస్తుంది. దోషభావాలులేని యోగి ఈ ఆనందాన్ని ఎప్పుడూ,నిరంతరాయంగా పొందుతాడు. ఈ యోగి సమదృష్టి కల్గి అన్నిప్రాణులను తనయందు,నాయందు మరియు తనయందు అన్నిప్రాణులనూ,నన్ను దర్శిస్తాడు.అతడియందే నా దృష్టి,నాయందే నా దృష్టి ఉంటుంది.
అర్జునుడు: కృష్ణా మనసు స్వభావసిద్దంగా చంచలమైనది కదా.గాలిని నిరోధించడం లానే కష్టమైన మనసును ఎలా నిగ్రహించగలము?
కృష్ణుడు: నువ్వన్నది నిజమే.ఐనా అభ్యాస,వైరాగ్యాలచే దాన్ని నిరోధించవచ్చు.మనోనిగ్రహం లేనిదే యోగసాధన అసాధ్యము.ఉంటే ఏ ఉపాయాలచేనైనా యోగసిద్ది పొందవచ్చు.
అర్జునుడు: మరి శ్రద్ద ఉండికూడా ప్రయత్నంచేయనివాడూ,ఏ కారణాలచేనైనా మనసు చలించి సిద్దిపొందని వాడి గతి ఏమిటి?అతడు ఇహపరాల రెండింటికీ చెడ్డ రేవడు కాడు కదా?
కృష్ణుడు: మంచికర్మలు చేయువాడికి ఎన్నడూ దుర్గతి కలుగదు నాయనా.ఇహపరాలలో అతనికి ఏ వినాశమూ కలుగదు. యోగభ్రష్టుడు మరణించిన తర్వాత పుణ్యలోకాలు పొంది అక్కడ చాలా కాలం ఉండి తిరిగి సదాచారులైన ధనికుల ఇంట పుడతాడు.లేక జ్ఞానయోగుల వంశంలో పుడతాడు కాని అటువంటి జన్మ దుర్లభం.అతడు తిరిగి సాధన ప్రారంభిస్తాడు. ఇలా జన్మ పరంపర అభ్యాసం వలన పాపపుణ్యాలను అధిగమించి పరమాత్మను పొందుతాడు. కర్మలు చేయువారికంటే,జ్ఞానులకంటే,తాపసుల కంటే యొగియే సర్వశ్రేష్టుడు.కావున నువ్వు కూడా యోగివి కావాలి. నాయందే మనసు నిలిపి,శ్రద్దతో నన్నే సేవించువాడే యోగులందరిలో ఉత్తముడు అన్నది నిస్సంశయం.

కర్మసన్యాసయోగము(5 వ అధ్యాయము)

అర్జునుడు: కర్మలను వదిలివేయమని ఒకసారీ,కర్మానుష్టానము చేయమని ఒక సారి చెప్తున్నావు.వీటిలో ఏది అనుసరించాలో చెప్పు?
కృష్ణుడు: కర్మత్యాగం,నిష్కామకర్మ రెండూ శ్రేష్టమే ఐనా నిష్కామకర్మ ఉత్తమం.రాగద్వేషాది ద్వంద్వాభావాలు లేనివాడే నిజమైన సన్యాసి మరియు అలాంటివారు మాత్రమే కర్మబంధాలనుండి తరిస్తారు.
జ్ఞానయోగం,కర్మయోగాలలో ఏది అవలంబించినా సరే ఒకటే ఫలితం ఉంటుంది.రెండూ ఒకటే అనే భావం కలిగిఉండాలి. యోగియై సన్యసించినవాడే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలడు. నిష్కాముడు,శుద్దమనస్కుడు,ఇంద్రియనిగ్రహి అన్ని ప్రాణులను తనవలనే చూస్కునేవాడిని ఎలాంటి కర్మలు బంధించలేవు.
కర్మయోగి చూసినా,వినినా,తాకినా,వాసన చూసినా,నిద్రించినా,శ్వాసించినా,మాట్లాడుతున్నా - ఆయా ఇంద్రియాలే వాటి విషయాల పని చేస్తున్నయనుకుంటాడు కాని తానేమీచేయడం లేదనే అనుభవం కలిగిఉంటాడు. ఫలితంపైన ఆశ లేక,ఈశ్వరార్పణంగా చేయుకర్మల వలన తామరాకుపై నీటిబొట్టు వలె పాపాలంటవు.
యోగులు అహంకారం లేక చిత్తశుద్ది కొరకు మాత్రమే కర్మలు చేస్తారు.ఫలాపేక్ష కలవారు కర్మలచే సంసారంలో బంధించబడతారు. ఆత్మనిష్ఠుడు కర్మసంకల్పం చేయక,ఇతరులచే చేయింపక నవద్వారాలు గల ఈ శరీరంలో సుఖంగా ఉంటాడు.
కర్మ,కర్మ చేయడం,దాని ఫలితం ఆత్మ ప్రేరణ కాదు.ఆ ప్రేరణను మాయ చేస్తోంది. ఆత్మకు పాపపుణ్యాలతో సంబంధం లేదు.కాని అజ్ఞానం వలన ఆ భ్రాంతి కలుగుతోంది.ఆత్మజ్ఞానం ప్రాప్తి కలిగినవారికి అజ్ఞానం నశించి పరమాత్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మజ్ఞాన ఆసక్తిపరులు తమ బుద్దినీ,మనుసునీ పరమాత్మ యందు నిలిపి మోక్షాన్ని పొందుతారు. విద్యావినయాలుగల బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణునియందు,చండాలునియందు,ఆవు,కుక్క,ఏనుగు అన్నిటియందు ఒకే దృష్టి కలిగిఉంటాడు.అతడు ఈ జన్మలోనే పరబ్రహ్మను చేరుతాడు.

సుఖాలకు పొంగక,దుఃఖాలకు క్రుంగని స్థిరబుద్దికలవాడే నిజమైన బ్రాహ్మణుడు మరియు బ్రహ్మజ్ఞాని.అతడు బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి నిత్యమైన బ్రహ్మానందాన్ని పొందుతాడు. తాత్కాలికాలైన,దుఃఖకారకాలైన ఇంద్రియ సుఖాలను బ్రహ్మజ్ఞాని కోరడు. ఎవరైతే ఈ జన్మలోనే కామక్రోధాలను జయిస్తారో వారు ఆత్మజ్ఞానం పొందుతారు.
ఎవరైతే స్వతంత్రుడై ఆత్మ యందే సుఖిస్తూ,ఆడుకుంటూ,ప్రకాశిస్తుంటారో, పాపపుణ్యాలను నశింపచేసుకొని జితేంద్రియుడై నిస్సందేహంగా ఉంటారో ఎల్లప్పుడూ అన్ని జీవుల సుఖం కోరువానికి మాత్రమే బ్రహ్మత్వం,బ్రహ్మానందం లభిస్తుంది. దృష్టిని భ్రూమధ్యంపై కేంద్రీకరించి ప్రాణ,అపాన మొదలగు వాయువులను సమం చేసి మనసు,బుద్ది,ఇంద్రియాలను స్వాధీనం చేస్కొని కోరిక,కోపం,భయం మొదలగువాటిని విడిచిన జ్ఞాని ముక్తుడవుతాడు. తపస్సులకు,యాగాలకు నేనే భోక్తను.నేనే సర్వలోకాలకు అధిపతిని,దైవాన్ని,సర్వభూతహితుడను.నన్ను తెలుసుకున్న యోగి క్షేమాన్ని పొందుతాడు.

Friday, September 19, 2008

జ్ఞానయోగము (4 వ అధ్యాయం)

ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది.
అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?"అన్నాడు.
కృష్ణుడు "నీకు,నాకు ఎన్నో జన్మలు గడిచాయి.అవన్నీ నాకు తెలుసు.నీకు తెలియదు.నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకునేనే జన్మిస్తుంటాను.
ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను.
ఈ విధంగా తెలుసుకొన్నవాడు,రాగ,ద్వేష,క్రోధ,భయాలను విడిచి నన్ను ధ్యానించేవాడు నన్నే పొందుతాడు.
నన్ను ఏఏ విధంగా ఆరాధిస్తే వారిని ఆయా విధంగా అనుగ్రహిస్తాను.మనుషులు అన్నివిధాలుగా నా మార్గాన్నే అనుసరిస్తున్నారు.కర్మఫలితాలు త్వరగా భూమిపైనే పొందుతున్నారు.
గుణకర్మలచేత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను.నేను ఆకర్తను,అవ్యయుడను.నిష్కాముదనై కర్మలను ఆచరించడం వలన నాకు అవి అంటవు.ఇలా చేసేవారిని కూడా అంటవు.జ్ఞానులు నిష్కామంగానే కర్మలు చేస్తారు.
ఏ కర్మలు చేయాలో,ఏవి చేయకూడదో చెప్తాను విను.
కర్మ,అకర్మ,వికర్మ అని మూడు రకాలు.కర్మగతి గాఢమైనది.కర్మలలో ఆకర్మలను,ఆకర్మలలో కర్మలను చూసేవాడు,ఫలాపేక్షరహితుడు,కర్తను అనే అహంకారాన్ని జ్ఞానాగ్నిచే దగ్దం చేసేవాడు బుద్ధిమంతుడు.కోరికలేనివాడు,జయాపజయాల పట్ల సమబుద్దిగలవాడు,సందేహరహితుడు,ఈర్ష్యారహితుడు బంధాలలో చిక్కుకోడు.

ఈశ్వరప్రీతిగా మాత్రమె కర్మలు చేయువాడికి ప్రారబ్దము కూడా నశిస్తుంది కాని బాధించవు.
ఇవ్వబడునది,ఇచ్చేవాడు,ఇచ్చుటకు ఉపయోగించే పదార్థాలు అన్ని కూడా బ్రహ్మమే.

కొందరు ఆత్మను ఆత్మ యందె,ఇంకొందరు ఇంద్రియాలను నిగ్రహమనే అగ్నిలో,మరికొందరు విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో ,మరికొందరు వాయుగమనాన్ని నిరోదించి అపానంలో ప్రాణాన్ని ,ప్రాణంలో అపానాన్ని,ఇంకొందరు ప్రాణాలను ప్రాణాలలోనే హోమం చేస్తున్నారు.

ద్రవ్యరూప యజ్ఞాన్ని,వ్రతరూప తపోయజ్ఞాన్ని,ప్రాణాయామ పరమైన యోగయజ్ఞాన్ని,వేదాభ్యాస స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇలా రకరకాలైన యజ్ఞాలు చేయబడుతున్నాయి.ఈ విధంగా వారు పాపాలను పోగొట్టుకుంటున్నారు.యజ్ఞశేషం అమృతంలాంటిది.యజ్ఞం చేయనివాడికి ఇహపరాలు రెండూ ఉండవు.
ఇలా ఎన్నో యజ్ఞాలు వేదాలలో చెప్పబడ్డాయి.అవన్నీ కర్మలపై ఆధారపడ్డవే.

తత్వవేత్తలను వినయముతో సేవించి,ప్రార్థించి జ్ఞానాన్ని తెలుసుకోవాలి.

ఆ జ్ఞానాన్ని తెలుసుకొంటే నా వలెనే సమస్తాన్ని నీయందే చూడగలవు.మోహానికి గురికావు.
ఎంతపాపి అయినా జ్ఞానం చేత సంసారాన్ని తరింపవచ్చు.
కర్రలను అగ్ని వలె,కర్మలను జ్ఞానం భస్మం చేస్తుంది.జ్ఞానమును మించినది లేదు.కర్మయోగసిద్ధిని పొందిన వాడు జ్ఞానాన్ని తనలోనే తెలుసుకొంటున్నాడు.
శ్రద్దజ్ఞానాలు లేనివారు,సందేహాలు కల్గినవాడు,నమ్మకం లేని వాడు చెడిపోతారు.ఇహపరాలు రెండింటికీ దూరమవుతారు.
పరమార్థ జ్ఞానంతో కర్మలను,బ్రహ్మజ్ఞానంతో సందేహనివృత్తిని చేసుకోన్నవాడిని కర్మలు బంధించవు.
కాబట్టి జ్ఞానం చే సందేహాలను నివృత్తి చేసుకొని యోగాన్ని ఆశ్రయించు.లే.

కర్మయోగము(3 వ అధ్యాయం)

అర్జునుడు కర్మయోగం కన్న జ్ఞానం గొప్పదని కృష్ణుడు అభిప్రాయపడుతున్నాడని తలచి తనను యుద్దం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుడిని అడిగాడు.
అప్పుడు కృష్ణుడు "
ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానయోగంగానూ,యోగులకు కర్మయోగంగానూ చెప్పాను.కర్మలు(పనులు) చేయకపోవడం వలనో లేక సన్యసించడంవలనో ముక్తి లభించదు.కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటికి నిగ్రహపరుడుగా ఉండి మనసులో మాత్రం విషయలోలుడిగా ఉంటాడో అతడిని డాంబికుడు అంటారు.ఇంద్రియనిగ్రహం కలిగి,ప్రతిఫలాపేక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు.
యజ్ఞకర్మలు మినహా మిగిలినవి బంధహేతువులు.బ్రహ్మదేవుడు యజ్ఞాలవలన ప్రజలు వృద్ది పొందుతారని ఉపదేశించాడు.
యజ్ఞాల ప్రాముఖ్యత
యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలు తీరుస్తారు.యజ్ఞశేషాన్ని తిన్నవారు పాపాలనుండి విముక్తులవుతారు.కర్మల వలన యజ్ఞాలు,యజ్ఞం వలన వర్షం,వర్షం వలన అన్నం ఆ అన్నం వలన సకలభూతాలు పుడుతున్నాయి.
పరమాత్మ వలన వేదాలు,వాటి వలన కర్మలు సంభవించాయి.ఈ కర్మచక్రాన్ని అతిక్రమించి,ఆచరించని వారు పాపులు.
ఆత్మజ్ఞానికి చేయవలసిన కర్మలు లేవు.అతడు సర్వస్వతంత్రుడు ఐన కారణంగా కర్మలు చేయడంవలన అతనికి లాభం కానీ,చేయకపోవడంవలన అతనికి నష్టం కాని ఉండవు.నీవు కూడా నిష్కామంగా కర్మలు చేయి.జనకుడు మొదలగువారు కూడా నిష్కామకర్మలు చేసారు.
ఉత్తముల కర్మలను,ప్రమాణాలను లోకులు ప్రమాణంగా తీసుకొని ప్రవర్తిస్తారు.
నాకు కూడా మూడు లోకాలలోనూ ఏ విధమైన కర్మలు చేయనవసరం లేనప్పటికీ లోకం కోసం,లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను.
ఓ అర్జునా అజ్ఞానులు ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్ట్లే ,జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి.జ్ఞాని పనిచేసేవారి బుధ్ధి చలింపచేయకుండా తను పని చేస్తూ వారి చేత కూడా పని చేయించాలి.అన్ని కర్మలూ ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞాని తనే చేస్తున్నానని తలుస్తాడు.కాని జ్ఞానికి అసలు విషయం తెలిసి అహంకారరహితంగా ఉంటాడు.
అలా ఆసక్తి కలిగినవారి మార్గాన్ని జ్ఞానులు ఆటంకపరచరాదు.
అన్ని కర్మలనూ నాకే సమర్పించి,కోరికలనూ,అహంకారాన్ని వదిలి దుఃఖాన్ని వదిలి వివేకవంతుడవై యుద్దం చేయి.పైవిధంగా చేసినవారు సమస్తకర్మ దోషాల నుండి విముక్తులవుతారు.మిగిలినవారు భ్రష్ఠులు.
మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది?
రాగద్వేషాలు జ్ఞానానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు.అందువలన మరణించినా ఫర్వాలేదు.

కామం యొక్క ప్రభావం

అప్పుడు అర్జునుడు ఇష్టంలేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు.కృష్ణుని సమాధానం
రజోగుణం నుండి పుట్టే కామక్రోధాలే దీనికి కారణం.పొగ చే అగ్ని,మాయచే పిండము కప్పబడినట్లు కామంచే జ్ఞానం కప్పబడి ఉంది.ఈ కామం మనస్సును ఆవరించి,వివేకాన్ని హరించి మనుషులను భ్రమింపచేస్తోంది.కాబట్టి ఇంద్రియనిగ్రహంతో కామాన్ని విడువు.
శరీరం కంటే ఇంద్రియాలు,వాటి కన్నా మనసు,మనసు కన్నా బుధ్ధి ,బుధ్ధి కన్నా ఆతమ గొప్పది.ఆత్మ వీటన్నిటికన్నా పైన ఉంటుంది.
కాబట్టి బుధ్ధితో మనసుని తద్వారా కామాన్ని జయించు.

Thursday, September 18, 2008

సాంఖ్యయోగము

అప్పుడు శ్రీకృష్ణుడు ఇటువంటి సమయంలో "నీకు ఇటువంటి ఆలోచనలు ఎందుకు కలుగుతున్నాయి. క్షుద్రమైన హృదయదౌర్బల్యాన్ని వీడి స్థిమితంగా ఉండు" అన్నాడు.
కాని అర్జునుడు "నేను గురువులను,పుజ్యసమానులను ఏ విధంగా చంపగలను.అయినా ఎవరు గెలుస్తారో చెప్పలేము కదా.నాకు దుఃఖం ఆగడంలేదు.నేను నీ శిష్యుణ్ణి.నాకేది మంచిదో నీవే చెప్పు"అంటూ యుద్ధం చేయను అంటూ చతికిలపడిపోయాడు.అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో

"దుఃఖించరానిదాని కోసం బాధపడుతున్నావు.తెలిసిన వాళ్ళెవరూ గతం గురించికాని,వర్తమానం గురించికాని బాధపడరు.అయినా నేను,నువ్వు,ఈ రాజులు గతంలోనూ ఉన్నాము.భవిష్యత్తులోనూ
ఉంటాము.బాల్యము,యవ్వనము,ముసలితనము ఎలానో మరణించి మరో దేహాన్ని పొందడం కూడా అలాగే.సుఖదుఃఖాలు శాశ్వతం కావు.ఇవి బాధించనివారు మోక్షానికి అర్హులు.
ఆత్మ లక్షణాలు
దేహం అనిత్యం,కాని ఆత్మ సత్యం అనునది ఋషులచే తెలుసుకోబడ్డ సత్యం.ఆత్మ సర్వవ్యాపకం.దేహాలు నశించినా ఆత్మ నశించదు.ఆత్మ చంపబడుతుందని కాని,చంపుతుందనిగాని భావించేవారు అజ్ఞానులు.ఇది
సనాతనము అనగా ఎప్పుడు ఉండేది.మనము ఎలాగైతే చిరిగిపోయిన పాతబట్టలు వదిలి కొత్తవి వేస్కుంటామో అలాగే ఆత్మ నిరుపయోగమైన శరీరం వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది.అగ్నికాని,గాలి కాని,నీరు గాని మరియు
ఆయుధాలు కాని ఆత్మను ఏమీ చేయలేవు.ఈ విషయాలు తెలుసుకొన్నవాడు దుఃఖించడు.పుట్టిన శరీరం చావకతప్పదు.మరలా పుట్టక తప్పాడు.దీనికి బాధపడనవసరం లేదు.అన్ని దేహాలలోను ఆత్మ ఉంది.

క్షత్రియులకు యుద్దధర్మం శ్రేష్ఠం.నీవు దయచేత యుద్ధం మానాలని చూస్తున్నా చూసేవారందరూ నీవు పిరికితనంచే చేయలేదని అనుకుంటారు.అపకీర్తి వస్తుంది.అమర్యాద పాలవుతావు.శత్రువులు చులకన చేస్తారు.మరణిస్తే
స్వర్గం,గెలిస్తే రాజ్యం పొందుతావు.సుఖదుఃఖాలను,జయాపజయాలను లెక్కించకుండా యుద్ధం చేస్తే నీకు పాపం అంటదు.కాబట్టి దృఢనిశ్చయుడవై యుద్ధం చేయి.

ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచం ఆచరించినా గొప్పఫలితాన్ని ఇచ్చి సంసారభయాన్ని దాటగలవు.ఇందులో నిశ్చలమైన బుద్ధి మాత్రమే ఏక కారణంగా ఉంటుంది.కొందరు స్వర్గప్రాప్తే ప్రధానమని తలచి కర్మలే చేస్తూ
నిశ్చలమైన ధ్యానంకాని,బుద్ధికాని లేక జననమరణాలు పొందుతుంటారు.ప్రకృతి యొక్క మూడుగుణాలకు అతీతుడవై,సుఖదుఃఖాలను విడిచి ఆత్మజ్ఞానివి కావాలి.బావితో ఎంత ప్రయోజనముందో ప్రయోజనమే మహానదులలో కూడా ఎలా ఉంటుందో అలాగే వేదకర్మల వలన పొందే శాంతి,జ్ఞానం వలన కూడా శాంతి ఉంటుంది.

పని చెయ్యి.కాని ఫలితంపైన ఆసక్తి పెంచుకోకు.అలా అని పని చేయడం ఆపకు.

జయాపజయాల పట్ల సమబుద్ధి కలిగిఉండు.ఈ బుద్ది కలిగినవారు పాపపుణ్యాలు నశింపచేసుకుని మోక్షము పొందుతారు.నీ మనసు స్థిరం కావాలి.
స్థితప్రజ్ఞుడి లక్షణాలు
అప్పుడు అర్జునుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు,నడవడిక గురించి అడుగగా కృష్ణుడు
"అన్ని కోరికలను వదిలి,దుఖానికి కలత పొందక,సుఖానికి పరవశించక,అనురాగము,కోపము,భయములను వదిలివేసి తన ఆత్మ యందె సంతోషపడువాడు స్థితప్రజ్ఞుడు అనబడుతాడు"అన్నాడు.
ఇంద్రియనిగ్రహం వలెనే స్థిరబుద్ధి కలుగుతుంది.

విషయాలను గురించి అతిగా ఆలోచించే వాడికి వాటిపై ఆసక్తి,అది నెరవేరకపోవడంవలన కోపం,ఆ కోపం వలన అవివేకం,అవివేకం వలన యుక్తాయుక్తజ్ఞానం,బుద్ధి నశించి అథోగతిపాలవుతాడు.

విషయాలను అనుభవిస్తున్నా ఇంద్రియనిగ్రహం కలిగిఉండడం ,కోపతాపాలు లేకుండడం ఉంటే నిశ్చలంగా ఉండవచ్చు.నిశ్చలత్వం లేని వాడికి శాంతి,అదిలేనివాడికి సుఖం ఎలా కలుగుతాయి? ఇంద్రియాలు పోతున్నట్టు మనసు పోతుంటే బుద్ధి నాశనము అవుతుంది. ఇంద్రియనిగ్రహం కలిగినవాడే స్థితప్రజ్ఞుడు కాగలడు.
లౌకిక విషయాలందు నిద్రతోను ,సామాన్యులు పట్టించుకోని ఆధ్యాత్మిక విషయాలందు జ్ఞాని మెలకువతోను ఉంటాడు.
బ్రాహ్మిస్థితి
సముద్రంలోకి ఎన్ని నీళ్ళు చేరినా సముద్రం ఎలా ప్రశాంతంగా,గంభీరంగా చెలియలికట్ట దాటకుండా ఉంటుందో అలానే స్థితప్రజ్ఞుడు తనలోకి ఎన్ని కోరికలు వచ్చినా ప్రశాంతంగా ఉంటాడు.అహంకారాన్ని,కోరికలను వదిలి ప్రశాంతంగా ఉండే ఇటువంటి స్థితిని బ్రాహ్మిస్థితి అంటారు.ఈ స్థితిని ఎవరైతే జీవించిఉండగానే పొందగలడో అతడే బ్రహ్మనిర్వాణపదాన్ని పొందుతాడు.

అర్జున విషాద యోగము

ఈ అధ్యాయం మొదటిది.
ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు.
కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి
బలాల,యోధుల గురించి పన్నిన,పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు.
అప్పుడు కౌరవులబలం,వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు.కృష్ణుడు అలానే చేసాడు.
అప్పుడు అర్జునుడు కౌరవులలోని తన పెదనాన్న బిడ్డలను,గురువులను,వయోవృద్ధులను అనగా భీష్ముడు,ద్రోణుడు,కృపాచార్యుడు మొదలగు పెద్దలను చూసి గుండె కరిగిపోయి కృష్ణునితో ఈ విధంగా అన్నాడు.

"కృష్ణా!అందరు మనవాళ్ళే,వారిలో కొందరు పుజ్యనీయులు.వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను?అయినా జయాపజయాలు దైవాధీనాలు కదా.ఎవరు గెలుస్తారో తెలియదు.వారు నన్ను చంపినా నేను మాత్రం వారిని చంపను.దుఃఖం చేత నేను,నా అవయవాలు స్థిమితం కోల్పోతున్నాయి"అని అంటూ తన ధనుర్బాణాలు వదిలివేసి దుఃఖించసాగాడు.

ఇక్కడితో మొదటి అధ్యాయం పూర్తవుతుంది.

గణేశ ప్రార్థన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే

వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా